|
లక్ష్మీపార్వతితో బాలకృష్ణ చర్చలు March 10, 2010 ఎన్టీఆర్ మరణం తర్వాత తొలిసారిగా బాలకృష్ణ లక్ష్మీపార్వతి
నివాసానికి వెళ్ళి ఆమెతో గంట పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కుటుంబ సమస్యలను
చర్చించుకున్నామని, ఎన్టీఆర్ పేరుపై ఒక చిరస్మరణీయమైన కార్యక్రమం తలపెట్టాలని
నిర్ణయించుకున్నామని సమావేశానంతరం లక్ష్మీపార్వతి చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే
సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెబుతామని ఆమె చెప్పారు. ఎన్నో ఏళ్ళ తర్వాత
బాలయ్య తమ ఇంటికి రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా
లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ పేరుతో ఆయన సామాన్లన్నిటినీ భద్రపరుస్తూ ఒక మ్యూజియం ఏర్పాటు చేయ
తలపెట్టామని, అలాగే క్యాన్సర్ ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేయాలని బాలయ్య
ఆశిస్తున్నారని ఆమె సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే కుమారుడు ఇంటికి నడిచొచ్చిన
ఆనందం ముందు మిగతా విషయాలన్నీ ప్రాముఖ్యం లేనివేనని అన్నారు. మేం మళ్ళీ మళ్ళీ
కలుసుకుంటాం, తల్లికి ఇంతకంటే కావాల్సిందేం ఉందని ఆమె ఉద్విగ్నంగా చెప్పారు.
రాజకీయాలు కాకుండా అచ్చంగా కుటుంబ సమస్యలనే మాట్లాడుకున్నామని, వెనుకటి స్మృతులను
నెమరువేసుకున్నామని చెప్పారు. తనను బాలకృష్ణ ఎన్టీఆర్ సతీమణిగా గుర్తించారని
విలేఖర్లకు తెలిపారు. అలాగే కొన్ని విషయాలను బాలకృష్ణ ప్రస్తావించగా, వాటి సంగతి
తర్వాత మాట్లాడదామనన్నారు. ఉగాదికి రమ్మని బాలకృష్ణను ఆహ్వానించానినీ లక్ష్మీపార్వతి
చెప్పారు. మొత్తంగా నందమూరి వారసులతో కలిసి ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయడానికి
బాలకృష్ణ రాక తోడ్పడిందని లక్ష్మీపార్వతి ఉద్వేగభరితంగా చెప్పారు.
|